
విశాఖపట్నం, 23 ఏప్రిల్ (హి.స.): ఇష్టపడి చేసిన పనిని.. కష్టపడి చేస్తే.. నష్టపోయేది లేదని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కన్నతల్లి, గురువును ఎప్పుడూ మరిచిపోకూడదని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం ఎంతో ముఖ్యమన్నారు.
‘‘ మనం ఎప్పుడూ సామ్రాజ్య వాదన చేయలేదు. కొన్ని దేశాల సామ్రాజ్య వాదన ధోరణి వల్లే యుద్ధాలు వస్తున్నాయి. రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. లక్షలాది కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని ఆలస్యం చేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వకుండా ఉంటే ఎలా? బిల్లు ఇవాళ కాకపోతే.. రేపైనా అమల్లోకి వస్తుంది. ఆధునిక సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు