
రాజమండ్రి, 23 ఏప్రిల్ (హి.స.)
పెద్దపులి సంచారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతంలోని గ్రామీణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. రాజమండ్రి సమీపంలోని కోరుకొండ మండలం, కాపవరం గ్రామ పరిధిలో ఉన్న పాండవుల మెట్టపై పెద్ద పులి సంచారంపై వదంతలు వ్యాపించాయి. కొన్ని రోజులుగా వినిపిస్తున్న వదంతులకు తెరదించుతూ, అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో పులి ఉనికిని అధికారికంగా ధ్రువీకరించారు. మెట్ట ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించామని, దాని కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని వారు వెల్లడించారు.
అటవీశాఖ ప్రకటనతో కాపవరం సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. చీకటి పడితే పులి గ్రామాల్లోకి ఎక్కడ ప్రవేశిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పశువులను మేత కోసం అటవీ ప్రాంతం వైపు గానీ, మెట్టపైకి గానీ తోలుకెళ్లవద్దని స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని, దానికి హాని తలపెట్టవద్దని కోరారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi