
అమరావతి, 24 ఏప్రిల్ (హి.స.)
:భీమవరం డీఎస్పీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు )తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని న్యాయస్థానాన్ని బాలిక తల్లి ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో ఈరోజు (శుక్రవారం) విచారణ జరిగింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని బాధితురాలిని పోలీసులు బెదిరించడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. బాలికకు అండగా ఉండాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఎలా...? అని న్యాయస్థానం మందలించింది.
ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పడానికి సిగ్గుగా అనిపించడం లేదా..? అని డీఎస్పీని హై కోర్టు ప్రశ్నించింది. రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు...? దేవుడు మీకేమైన దివ్య దృష్టి ఇచ్చారా.? అని నిలదీసింది. రాజకీయ కారణాలా... లేక ఇతర కారణాలా అనేది సంబంధిత కోర్టు తేలుస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాజకీయ వత్తిళ్లు తట్టుకోలేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డీఎస్పీపై కోర్టు మండిపడింది. డీఎస్పీ వివరణ సంతృప్తికరంగా లేదని కేసు రికార్డులతో తమ ముందు హాజరు కావాలని జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ