
అమరావతి, 24 ఏప్రిల్ (హి.స.)వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిల్లర్ పార్టీతో టీడీపీ నేతలు అందరూ జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కిల్లర్ పార్టీ ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోందని.. వారి ఆగడాలు చెల్లనీవ్వనని హెచ్చరించారు. జగన్ అండ్ కో రోడ్ల మీదకు వస్తారని... రెచ్చగొడతారని... రప్పా రప్పా అంటారని... ప్రజలను ఇబ్బందులు పెడతారని... చర్యలు తీసుకుంటే రాజకీయమంటారని ఎద్దేవా చేశారు. ఈరోజు(శుక్రవారం) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్చార్జ్ల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి హాజరై మాట్లాడారు. శిక్షణా తరగతులకు వచ్చిన క్లస్టర్ ఇన్చార్జ్లతో కాఫీ కబుర్లు కార్యక్రమం నిర్వహించారు.
పార్టీ సిద్దాంతాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై క్లస్టర్ ఇన్చార్జ్లతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ప్రతీ కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని... కేడర్ దాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సమకాలీన రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ చేస్తున్న అరాచకాలను సీఎం వివరించారు. ప్రస్తుత పరిణామాల్లో క్రిమినల్స్తో రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు వంటి అంశాలను ప్రస్తావించారు. అవకాశాలను ఉపయోగించుకుని కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు. 2019లో వైసీపీ గెలిచాక రాష్ట్రం అభివృద్ధి జరగలేదని ప్రస్తావించారు. తనను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బంది పెట్టినా కార్యకర్తలను కాపాడుకున్నానని స్పష్టం చేశారు.
రాజకీయాలను దాటి... సామాన్య ప్రజలను జగన్ హయాంలో ఇబ్బందులకు గురి చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. 2019-24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాలని అన్నారు. మనం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడంతోపాటు... కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం పడే కష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. టీడీపీలో కార్యకర్తలే అధినేతలని... రైట్ రాయల్గా బతకాలని.. పార్టీ కూడా కార్యకర్తలను అంతే గౌరవిస్తుందనని స్పష్టం చేశారు. అన్యాయం జరిగిందని జగన్ రెడ్డి పరామర్శకు వెళ్తారని... కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపేస్తారని... కానీ తన కారు కింద పడిపోయిన కార్యకర్తను మాత్రం ఎందుకు పరామర్శించరని ప్రశ్నించారు. కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారని ఆరోపించారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూములను దోపిడీ చేశారని ఆగ్రహించారు.
పంపకాల్లో విభేదాలు రావడంతో దస్తగిరి అనే కార్యకర్తను చంపేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వాళ్ల అనుచరులను వాళ్లే చంపుకుని నేరం తమపై నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. తన జీవితంలో ఎన్నో రాజకీయ పోరాటాలు చేశాను తప్ప... నేరగాళ్లతో ఏనాడూ పోరాడలేదని.. ఇది తనకు కొత్తగానే ఉందని తెలిపారు. ఎన్నిలయ్యేదాకా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను వాడుకున్నారని... అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలని జగన్ చెల్లెలు వైఎస్ సునీతారెడ్డి అడిగితే సైలెంట్గా ఉండమని ఆమెను బెదిరించారని ఆగ్రహిచారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్