
హైదరాబాద్, 24 ఏప్రిల్ (హి.స.)ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శంకర్ మృతిని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయం చేస్తున్న తీరు హేయనీయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు బీఆర్ఎస్ నాయకులు కార్మికులను రెచ్చగొడుతుంటే.. మరోవైపు బీజేపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణం బండి సంజయ్ అని వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ శవ రాజకీయాలు చేస్తున్నారని దయాకర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి బండి సంజయ్ కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందించిందో అందరికీ తెలుసన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా శంకర్ గౌడ్ కుటుంబాన్ని కలిసి ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. శంకర్ గౌడ్ కుటుంబం పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, చనిపోయిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని సర్కార్ ప్రకటించిందన్నారు.
సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూస్తుంటే.. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ మండిపడ్డారు. సీఎం, మంత్రివర్గం అంతా.. ఆర్టీసీ కార్మికులు తొందరపడవద్దని విజ్ఞప్తి చేశారన్నారు. సమస్య పరిష్కారానికి తాము ప్రయత్నిస్తుంటే.. బండి సంజయ్, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఓట్లు వెతుక్కుంటున్నారని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్