ఆర్టీసీ కార్మికులకు బిజెపి పూర్తి మద్దతు.. ఎంపీ కొండా..
ఆర్టీసీ కార్మికులకు బిజెపి పూర్తి మద్దతు.. ఎంపీ కొండా..
BJP mp


ఖమ్మం, 24 ఏప్రిల్ (హి.స.)

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని బీజేపీ నాయకులు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తో కలిసి ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు ఆయన స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ కార్మికుల తలరాతలు మారలేదని, సంస్థను ప్రైవేటీకరించే కుట్రలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి ఆర్టీసీని గత కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు.

కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందడంతో ఆర్టీసీ కష్టాలు తీరుతాయని కార్మికులతో పాటు తాము కూడా ఆశించామని, కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీని మరింత దిగజార్చుతోందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టీసీ సమస్యలపై గొంతెత్తిన రేవంత్ రెడ్డి, జేఏసీ కోదండరాం లాంటి నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని మియాపూర్ బస్ డిపో వద్ద ఉన్న సుమారు 50 ఎకరాల విలువైన ఆర్టీసీ భూములను ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ల పేరుతో ప్రైవేట్ సంస్థ అయిన 'మెగా' కృష్ణా రెడ్డికి అప్పగించడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు.

పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలుకు రూ.55 లక్షల భారీ సబ్సిడీ ఇస్తోందని, ఆ నిధులను ఉపయోగించి ఆర్టీసీయే స్వయంగా బస్సులను కొనుగోలు చేసి నడపాలి తప్ప, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీలే ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నాయని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పథకమని, దానికి సంబంధించిన పూర్తి ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించాలి తప్ప, ఆ ఖర్చును ఆర్టీసీ నెత్తిన రుద్దడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారు ఇక్కడే ఉన్నా.. ఆర్టీసీ కార్మికుల సమ్మెను, వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

కార్మికులు అధైర్యపడవద్దని, వారు తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు బీజేపీ అండగా నిలబడి పోరాడుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande