వరంగల్ ముత్తోజిపేటలో బండి సంజయ్ వర్సెస్ పోలీసులు
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Bandi sanjay


వరంగల్, 24 ఏప్రిల్ (హి.స.)ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ ముత్తోజిపేటకు చేరుకుని కేంద్ర మంత్రితో మాట్లాడారు. నర్సంపేట డిపోకు శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ముత్తోజిపేటలో పరిస్థితి బండి సంజయ్ వర్సెస్ పోలీసులు అన్నట్టుగా మారింది.

శంకర్ గౌడ్ అంత్యక్రియలు నిర్వహించాల్సిన కొడుకు హేమంత్ను బీజేపీ నేతలు నర్సంపేట డిపోకు తీసుకెళ్లారు. అయితే శంకర్ గౌడ్ డెడ్ బాడీని తిరిగి కూతురు ఇంటికి తరలించారు పోలీసులు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ అంత్యక్రియలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎట్టిపరిస్థితుల్లో శంకర్ మృతదేహాన్ని డిపోకు తరలించాలని బండి సంజయ్ పట్టుబడుతుండగా.. అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. దీంతో 365 జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అంతకుముందు భారీ కాన్వాయ్తో బండి సంజయ్, బీజేపీ శ్రేణులు ముత్తోజిపేటకు చేరుకున్నారు. శంకర్ గౌడ్ మృతదేహానికి కేంద్ర మంత్రి నివాళులర్పించారు. బండి సంజయ్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతదేహాన్ని డిపోకు తీసుకెళ్లనీయకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తోందని ఆరోపించారు. మానవతా విలువలు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సంప్రదాయాలను విస్మరిస్తోందని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ కార్మికుల దగ్గరకు వెళ్లి రాజకీయం చేయలేదా అని ప్రశ్నించారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లనివ్వకపోతే రేపటి వరకూ బాడీ ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం కుటుంబ సభ్యులకైనా మృతదేహాన్ని డిపోకు తీసుకెళ్లే అవకాశం కల్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande