రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసింది: డీజీపీ శివధర్ రెడ్డి
రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసింది: డీజీపీ శివధర్ రెడ్డి
Dgp


రాజన్న సిరిసిల్ల, 24 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు

పార్టీ అధ్యాయం ముగిసిందని, ఇక ఇప్పటి నుంచి ఏకే 47 అవసరం ఉండదని, కొత్త పోలీస్ విధానం రాబోతోందని డీజీపీ బి.శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రుద్రంగి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితేలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీస్ అంటే రౌడీలకు గుండాలకు కాదని, ఇది సామాన్యులకేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ గంజాయి వంటి నివారణకై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

తాను 1995లో ఈ ప్రాంతానికి వచ్చానని ఆనాడు ఈ ప్రాంతం నక్సల్స్ ప్రాబల్యంతో నిండి ఉండేదని, ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని అన్నారు. తాను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చూసుకుంటూ వస్తే రోడ్డుపై చాలామంది వాహనదారులు హెల్మెట్ పెట్టుకోలేదని, ప్రతి ఒక్కరూ రోడ్డు పై సమానమేనని, ఈనాడు అనేక మరణాలు రోడ్డు ప్రమాదం వల్లనే జరుగుతున్నాయని ప్రమాదాల నివారణకు వాహనదారులు అందరూ సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించి కుటుంబం ముఖ్యమనే విషయాన్ని గుర్తించుకోవాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande