
బూర్గంపహాడ్,:, 24 ఏప్రిల్ (హి.స.)
13వ వేతన ఒప్పందం ముగిసి 24 రోజులు గడుస్తున్నా యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సారపాక ఐటీసీ కర్మాగారంలోని అడ్మిన్ బ్లాక్ వద్ద 24 గంటల పాటు మహా ధర్నాను కార్మికులు ఎండను సైతం లెక్కచేయకుండా చేపట్టారు. యూనిట్లో కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు యాజమాన్యం స్పందించకపోవడం, గుర్తింపు సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా విసిగి వేసారి కార్మిక లోకం ఈ నిరసన ధర్నాతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్నాలో ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల కష్టార్జితంతో లాభాలు గడిస్తున్న యాజమాన్యం కార్మికుల కనీస అవసరాలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi