
హనుమకొండ, 24 ఏప్రిల్ (హి.స.)
గత ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధి పనులు అన్ని చేస్తానని.. గత 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వారు అభివృద్ధిని పట్టించుకోలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లి గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.35లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇల్లు, పీఏసీఎస్ ధర్మసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3లక్షల 50వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నారని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 20వేల ఎకరాలలో మక్కల సాగు రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్దతు ఇచ్చి దాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ధాన్యం కొనుగోలుతో సీజన్ కు ప్రభుత్వానికి 5వేల కోట్ల నష్టం వస్తుందని అయినప్పటికీ రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకొని మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలని
సూచించారు.
మల్లక్ పల్లి గ్రామానికి మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడే మొట్ట మొదటి సారిగా బిటీ రోడ్డు వేసింది నేనే అని అన్నారు. ఈ రెండేళ్లలో కోటి 50 లక్షల అభివృద్ధి పనులు మంజూరు చేశానని తెలిపారు. రెండో విడతలో మరో 40ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని, మల్లక్ పల్లి నుంచి రాంపూర్ రోడ్డును కూడా త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాశ్వత భవనం నిర్మిస్తానని తెలిపారు. మల్లక్ పల్లి, ధర్మాపురం గ్రామాల రైతులకు పైప్ లైన్ ద్వారా గోదావరి జలాలు తీసుకువస్తానని వెల్లడించారు. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారు అభివృద్ధిని పట్టించుకోలేదని, తాగుడు, తినుడే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇప్పుడు వాళ్ళు చేయని పనులన్నీ నన్నే చేయమని అడుగుతున్నారు. అన్ని పనులు చేయలేనని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాని తెలిపారు. పని చేసే వారికీ ప్రజల సహకారం, మద్దతు ఉండాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..