
అమరావతి, 25 ఏప్రిల్ (హి.స.)బార్లు మూసివేసిన తర్వాత వాటి ఫొటోలు తీసే అర్థరాత్రి విధుల నుంచి కానిస్టేబుళ్లకు ఎక్సైజ్ శాఖ ఉపశమనం కల్పించింది. అర్థరాత్రి విధులపై కానిస్టేబుళ్లలో వ్యతిరేకత రావడం, గురువారం అర్ధరాత్రి విశాఖపట్నంలో ఓ హెడ్కానిస్టేబుల్ విధుల అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటనల నేపథ్యంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులు దీనిని సమీక్షించారు. అర్ధరాత్రి 12గంటలకు బార్లు మూసిన తర్వాత ఫొటోలు తీయడం, తిరిగి ఇళ్లకు చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో బార్లు మూసిన తర్వాత అక్కడున్న సీసీ కెమేరాల ద్వారా సమయపాలనను పర్యవేక్షించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సీసీ కెమేరాలు సక్రమంగా పనిచేయకపోతే ఆయా బార్ల సిబ్బందికి వీడియో కాల్ చేసి మూసిన విషయం నిర్ధారించుకునే విధానం అమలుచేయనున్నారు.
కాగా ప్రస్తుతానికి ఎక్సైజ్ ఐ యాప్ అమలును ‘తప్పనిసరి’ అనే కోణంలో కాకుండా అక్కడి వెసులుబాటునుబట్టి ఫొటోలు తీయడంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లాల అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
విశాఖపట్నంలోని సీతమ్మధార స్టేషన్లో పనిచేస్తున్న ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ఎల్ఎస్ నాయుడు విధుల్లో మృతి చెందడం పట్ల ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి శాఖ నుంచి రూ.10లక్షల పరిహారం, ఎస్బీఐ బీమా పథకం నుంచి రూ.ఒక కోటి అందుతుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ