
అమరావతి, 25 ఏప్రిల్ (హి.స.)
విజయవాడకు చెందిన నీలం వెంకట మోహన్, భవాని దంపతులది మధ్యతరగతి కుటుంబం. మోహన్కు కృష్ణా నదిలో స్విమ్మింగ్ చేయడం అలవాటు. ఒకరోజు రెండేళ్ల వయసున్న తన కుమారుడు దేవగణేశ్ను కూడా నదికి తీసుకెళ్లారు. తండ్రి ఈత కొట్టడం చూసి.. బాలుడు కూడా నీళ్లలో దిగి సరదాగా అటూఇటూ చేతులు ఆడించాడు. కొడుకు ఆసక్తిని గుర్తించిన తండ్రి.. రోజూ తనతోపాటు నదికి తీసుకెళ్లి అలా అలా ఈత నేర్పించారు. అతి తక్కువ సమయంలో దేవగణేశ్కు ఈతలో పట్టు చిక్కింది. మూడున్నర ఏళ్లలోనే కృష్ణా రివర్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని అవార్డు పొందాడు! నాలుగేళ్ల వయసులోనే ఈ చివరి నుంచి ఆ చివరికి నదిని ఈదేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరేళ్లకే జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించాడు. తన ప్రతిభతో తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు అంటే 2016లో దిల్లీలోని శాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అకాడమీకి ఎంపికయ్యాడు. అప్పుడు దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక బాలుడు ఇతడే!
అక్కడే ఉంటూ మరింతగా నైపుణ్యాలు పెంచుకుని.. పతకాల పంట పండించాడు. గ్రూప్-5 (సబ్ జూనియర్ నేషనల్స్) బెంగళూరులో 2014, 2015 సంవత్సరాల్లో జరిగిన క్లబ్ నేషనల్ పోటీల్లో మూడు బంగారు పతకాలు గెలిచాడు. గ్రూప్-2 (14-16 ఏళ్లు) విభాగంలోనూ 2022లో బెంగళూరులో ఒక బంగారు పతకం, రెండు బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకున్నాడు. 2024, భువనేశ్వర్లో జరిగిన జూనియర్ నేషనల్ పోటీల్లో ఒక బ్రాంజ్ మెడల్ గెలుపొందాడు. గ్రూప్-1 విభాగంలో.. చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో బ్రాంజ్ గెలిచాడు. 2025లో బిహార్లో జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అతడి ఖాతాలో 60 వరకు రాష్ట్రస్థాయి పతకాలున్నాయి!
సాధారణంగా 19 ఏళ్లు నిండిన వారికే ఉద్యోగాల్లో అవకాశాలు ఇస్తారు. కానీ.. తొలిసారిగా 19 ఏళ్లలోపే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించిన వ్యక్తిగా దేవగణేశ్ గుర్తింపు పొందాడు. ఇతని ప్రతిభను చూసిన రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) 18 సంవత్సరాల అయిదు నెలలకే ఉద్యోగం ఇచ్చింది. రైల్వేకు లేఖ రాసి, మినహాయింపు ఇచ్చేలా చేసింది. 2025, నవంబరులో సౌత్ వెస్ట్రన్ రైల్వే, హుబ్బళ్లిలో మెకానికల్ వర్క్షాప్లో ఉద్యోగం ఇచ్చింది. అప్పటి నుంచి అతడు రైల్వే తరఫున బరిలో దిగుతున్నాడు. భారతదేశం తరఫున ఆడాలనే లక్ష్యంతో ప్రస్తుతం బెంగళూరులో ప్రత్యేక సాధన చేస్తున్నాడు.
తాను ఎదుర్కొన్న ఇబ్బందుల కంటే.. తల్లిదండ్రులు పడిన శ్రమే తననీ స్థాయికి తీసుకొచ్చిందంటాడు దేవగణేశ్. పూజాసామగ్రి అమ్మగా వచ్చిన డబ్బులతోనే ఇంటి అద్దె కట్టాలి. ఇద్దరు పిల్లలను చదివించాలి. ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా తమ పిల్లలకు క్రీడల్లో మంచి భవిష్యత్తు ఇవ్వాలని.. వారిపైనే పెట్టుబడి పెట్టారు తల్లిదండ్రులు. వీరి కుమార్తె మణి శ్రావణిని కూడా పవర్ లిఫ్టర్గా మలిచారు. పిల్లలిద్దరి క్రీడా పరికరాలు, దుస్తులు, పోషకాహారానికి రూ.లక్షల్లో ఖర్చుచేశారు. ప్రస్తుతం కుమారుడికి రైల్వే ఉద్యోగం రావడంతో వారి కష్టమంతా మరిచిపోయి సంతోషిస్తున్నారు. సీనియర్ నేషనల్స్, భారత జట్టు తరఫున ఆడి.. ఆ పతకాలను తల్లిదండ్రుల చేతుల్లో పెట్టి.. వారి ఆనందాన్ని చూడాలంటున్నాడు దేవగణేశ్!
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ