
అనంతపురం, 25 ఏప్రిల్ (హి.స.)అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో కీలక నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి పావని వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని జిల్లా జైలుకు తరలించారు. హనీట్రాప్ గ్యాంగ్లో కీలక నిందితురాలు రంగమ్మ నాయుడు అలియాస్ చిన్నీని ఇదివరకే అరెస్టు చేయగా.. ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రంగమ్మ తర్వాత గ్యాంగ్లో కీలకంగా వ్యవహించిన దబ్బర రాజేష్ నాయుడు, జయలక్ష్మి, చంద్రకళ, అనంతకుమారిని గురువారం అరెస్టు చేశారు. వీరిని ఈరోజు ఉదయం స్థానిక జిల్లా సర్వజన ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం.. స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. హనీట్రాప్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకూ తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్టు చేయగా, నలుగురు పరారీలో ఉన్నారు. కాగా, కేసుల దర్యాప్తులో భాగంగా రంగమ్మను పోలీసులు కస్టడీని తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే కోర్టు అనుమతి వచ్చినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ