
అమరావతి, 25 ఏప్రిల్ (హి.స.)డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు అతి త్వరలో ఈగల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. శనివారం మంగళగిరిలో ఈగల్ హెడ్ క్వార్టర్స్ను ఆయన ప్రారంభించారు. అనంతరం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితం ఈగల్ వింగ్ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశామన్నారు. పని తీరుతో ఈగల్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈగల్ను ప్రీమియర్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుతున్నామన్నారు.
గంజాయి పెంపకం, ఉత్పత్తిను నిరోధించేందుకు.. అలాగే ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్) అమలు చేయడంలో ఈగల్ ముందుందని వివరించారు. గతంలో ఆక్టోపస్, గ్రేహోండ్స్ తరహాలోనే ఈగల్ కూడా బాగా రాణిస్తుందని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు జీరో చేయగలిగారని చెప్పారు. భవిష్యత్తులో ఈగల్ టీం మరింత యాక్టివ్గా పని చేస్తుందని పేర్కొన్నారు. డ్రోన్లు, శాటిలైట్లతో గంజాయి నిర్మూలన చేస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ వినియోగించే వారిపై ఫోకస్ పెడుతున్నామని ఏపీ డీజీపీ తెలిపారు. ఆ క్రమంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్, గంజాయిని ఎవరు వినియోగిస్తున్నారు? ఎందుకు వినియోగిస్తున్నారనే కోణంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. మొదటి దశలో 10 వేల టెస్టింగ్ కిట్స్ వినియోగించామన్నారు. అలాగే డ్రగ్స్ వినియోగించే వారు.. పేమెంట్స్ ఎలా చేస్తున్నారు? ఎక్కడ నుంచి వాటిని తీసుకు వస్తున్నారు? అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నామని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వివరించారు.
డ్రగ్స్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ఈగల్ చర్యలు చేపడుతుందని చెప్పారు. ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్ వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 13 కొత్త ఎన్డీపీఎస్ కోర్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వేల డ్రగ్స్ కేసులు ఉన్నాయని.. అవి ట్రయిల్లో ఉన్నాయని గణాంకాలతో సహా డీజీపీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐ.జి రవికృష్ణతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్