
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)
డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం (Telagana Government) మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వార్షిక ఫలితాల వెల్లడిలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వార్షిక రిపోర్ట్ కార్డులను (Progress Cards) నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్ (Whatsaap) నంబర్లకు పంపి సరికొత్త రికార్డు సృష్టించింది. సాధారణంగా పరీక్షల ఫలితాల అనంతరం ప్రోగ్రెస్ కార్డులు తీసుకోవడానికి తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ అవసరం లేకుండా, సుమారు 18 లక్షల మందికి పైగా విద్యార్థుల ఫలితాలను వారి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకే చేరవేసింది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో 'మీ సేవ' (MeSeva) సాంకేతిక సహకారంతో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
అయితే, ఈ విధానం వల్ల విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుంది. పాఠశాలలకు వెళ్లే శ్రమ తగ్గడమే కాకుండా, కాగిత రహిత (Paperless) విధానాన్ని ప్రోత్సహించినట్లయింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ఇలాంటి అత్యాధునిక సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల విద్యావేత్తలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ ముందడుగు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు