
మెదక్, 25 ఏప్రిల్ (హి.స.)
టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సందర్భంగా మెదక్ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు పటాకులు కాల్చి మిఠాయి తినిపించుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించడం సంతోషదాయకమన్నారు. జేఏసీ నాయకులతో సుమారు పన్నెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి ముఖ్యమైన 11 % ఫిట్మెంట్, యూనియన్ల ఎన్నికల నిర్వహణకు వంటి డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు.
శాంతియుతంగా నిర్వహించిన సమ్మె కార్యక్రమాలలో తమకు మద్దతు ఇచ్చిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల డిమాండ్ లకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు