
అమరావతి, 25 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తూ, వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ ఆయన అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది. ఈ అవార్డును అందుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ముంబైలో పర్యటించనున్నారు.
'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో పాటు 'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు' వంటి విధానాలను పక్కాగా అమలు చేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు చూపుతున్న చొరవను ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి సుమారు రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన సఫలీకృతం కావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది.
పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడం, టెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ రంగాల్లో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే ఆయన లక్ష్యాన్ని జ్యూరీ కొనియాడింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన అనుభవాన్ని ప్రస్తుత నవ్యాంధ్ర నిర్మాణంలోనూ చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని పేర్కొంది.
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల మధ్య ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, ఎస్. జై శంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. వారి సరసన ఇప్పుడు చంద్రబాబు చేరనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi