
అమరావతి, 26 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ లో వాహనదారులను కొన్ని రోజులుగా డీజిల్ కొరత వేధిస్తోంది. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కొరత కారణంగా వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట చేతికి వస్తున్న తరుణంలో కోత మిషన్లకు కనీసం లీటర్ డీజిల్ కూడా దొరకడం లేదు. దీంతో అన్నదాతలకు పెద్ద సవాల్ ఎదురవుతోంది.
అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా కొన్ని రోజులపాటు గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడగా.. తాజాగా డీజిల్ దొరక్క సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాష్ట్రంలో డీజిల్ కొరతతో బంకులు మూసివేయడంపై సంబంధిత అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజిల్ కొరత ఉందంటూ ప్రచారం జరగడంతో వినియోగదారులు ప్యానిక్ కొనుగోళ్లకు దిగుతున్నారని చంద్రబాబుకు అధికారులు వివరించారు.
ప్యానిక్ కొనుగోళ్లతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,510 బంకులు ఉన్నాయని.. వాటిల్లో 421 బంకులకు సరఫరా లేక మూతపడినట్లు వెల్లడించారు. అధికారులు నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నారు. తక్షణమే తగిన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ