
కర్నూల్ , 26 ఏప్రిల్ (హి.స.)రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తుంగభద్ర జలాశయం మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. కీలకమైన ఈ డ్యాం భద్రతపై ఏడాదిగా నెలకొన్న ఆందోళనలకు తెరదించుతూ మొత్తం 33 క్రస్ట్గేట్ల ఆధునికీకరణ ప్రక్రియ శనివారంతో విజయవంతంగా ముగిసింది. దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ భారీ ఇంజనీరింగ్ అద్భుతాన్ని కాపాడుకునేందుకు 2026 ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఈ యజ్ఞం యుద్ధ ప్రాతిపదికన సాగింది. రెండు నెలల వ్యవధిలోనే 33 గేట్లను బిగించి, ఎరక్షన్ పనులు పూర్తిచేశారని, ఇది సాంకేతిక బృందం సాధించిన గొప్ప విజయమని టీబీపీ బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే 25 గేట్ల ట్రయల్ రన్ పూర్తి అయిందని తెలిపారు. 15 గేట్లకు రబ్బర్ సీల్స్ కూడా వేశామని, మిగిలిన గేట్లకు సంబంధించి వెల్డింగ్, రబ్బర్ సీల్స్ ఏర్పాటు, పెయింటింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ