
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతక్రమశిక్షణపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ విజయానికి గండికొట్టేలా వ్యవహరించారన్న ఆరోపణలపై హరిప్రసాద్, కృష్ణ కిశోర్లకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి, ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మల్లు రవి తెలిపారు. ప్రస్తుతం కృష్ణ కిశోర్ అమెరికాలో ఉన్నానని, హరిప్రసాద్ తన ఇంట్లో ఫంక్షన్ ఉందని సమాచారం ఇచ్చారని.. అయినప్పటికీ పది రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని వారికి షోకాజ్ నోటీసులు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు పార్టీకి నష్టం కలిగించేలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడటంపై కమిటీ సీరియస్ అయ్యింది. ఈ అంశాలను సుమోటోగా స్వీకరించి చర్చించామన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పార్టీ పరంగా పీసీసీ అధ్యక్షుడు లేదా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వ పరంగా సమస్యలుంటే సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించిందని మల్లు రవి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు