
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)
మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ
అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ అణచివేస్తోందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని రాయదుర్గం సత్త్వ నాలెడ్జ్ పార్క్ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నోటి క్యాన్సర్ మరాథాన్లో పాల్గొన్న ఆయన, 10కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, యువత యోగా, వ్యాయామం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని కోరారు.
చెడు అలవాట్ల వల్ల ప్రాణనష్టాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, సమాజంలో అవగాహన పెంపు అత్యవసరమని తెలిపారు. గుట్కా వంటి హానికర అలవాట్లపై చైతన్యవంతమైన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని హెచ్చరించి, వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్ సీపీ రమేష్ 5కే రను జెండా ఊపి ప్రారంభించారు. మరో అతిథిగా పాల్గొన్న బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు 2కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నోటి క్యాన్సర్ కారణంగా దేశంలో లక్షలాది మంది మరణిస్తున్నారని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు