
భద్రాచలం, 26 ఏప్రిల్ (హి.స.)
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శనివారం అంకురారోపణ కార్యక్రమం నిర్వహించగా, ఆదివారం ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న దేవతామూర్థులకు 15 ఉపాలయాలలోని 72 కళావాహన, జీర్ణోద్దరణ ఈ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు పాల్గొని పర్యవేక్షించారు. అలాగే యాదగిరిగుట్ట, సింహాచలం, ధర్మపురి నుంచి 30 మంది ఋత్వికులు రాగా, మొత్తం 60 మంది ఋత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 72 దేవతా మూర్తులతో పాటు ఆలయంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు గోపురాలకు కూడా కళావాహన నిర్వహించారు. జీర్ణోద్దరణలో భాగంగా దేవతా మూర్తులను భక్తరామాదాసు ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో భద్రపరచనున్నారు. రామాలయం అభివృద్ధికి మొదటి విడతగా ప్రభుత్వం రు.351 కోట్లు నిధులు కేటాయుంచగా, త్వరలో ఆలయ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి.
కళావాహన నిర్వహించిన దేవతా మూర్తులలో లక్ష్మీ తాయారు అమ్మవారు, గోదాదేవి అమ్మవారిని ప్రధాన ఆలయంలో వేంచేపు చేయనున్నారు. కళా వాహన సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ దర్శనాలు నిలిపివేశారు. భక్త రామదాసు వారు ఆలయం నిర్మించిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి 72 దేవతా మూర్తులకు కళావాహన నిర్వహించడం ఆలయ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు