
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో 2027 జనాభా లెక్కల (సెన్సస్) తొలి విడత ప్రక్రియ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆన్లైన్ విధానంలో తన వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గవర్నర్తో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారుల సమక్షంలో 'సెల్ఫ్ ఎన్యూమరేషన్' (స్వీయ గణన) ద్వారా తన జనాభా లెక్కల వివరాలను నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వారు ఆదర్శంగా నిలవడమే కాకుండా, రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు.
పౌరులంతా తమ కుటుంబ వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో నమోదు చేసుకోవాలని గవర్నర్ కోరారు. ఖచ్చితమైన, సమగ్రమైన జనాభా లెక్కల కోసం ప్రతి కుటుంబం భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఏ ఒక్క ఇల్లూ లెక్కల్లోంచి తప్పిపోకూడదని గవర్నర్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్వీయ గణన ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రజలందరూ ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. 2027 సెన్సస్ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆన్లైన్ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, దేశ ప్రగతికి తోడ్పడే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..