
అమరావతి 26 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ది ఎకనామిక్ టైమ్స్' ఆయనను 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025' అవార్డుతో సత్కరించింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిన్న జరిగిన 26వ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.ఈ పురస్కారంపై ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వ శైలి ఎంతో స్ఫూర్తినిస్తుంది. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అమలు చేస్తున్న పాలనా విధానాలు, పారిశ్రామికవృద్ధికి చేపడుతున్న సంస్కరణలు కచ్చితంగా సత్ఫలితాలనిస్తాయి. ఆయనకు దక్కిన ఈ అవార్డు రాష్ట్రమంతటికీ గర్వ కారణంగా భావిస్తున్నాను, అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
బిజినెస్ రిఫార్మర్ అవార్డు సాధించిన చంద్రబాబుకు మంత్రులు శుభాకాంక్షలను తెలియజేశారు. చంద్రబాబుకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కరణల అమలు లక్ష్యంతో ఏపీ వేగంగా దూసుకెళ్తోందని లోకేశ్ అన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు మంత్రులు అచ్చెన్న, సంధ్యారాణి, అనిత, సుభాష్, నిమ్మల, కొల్లు, అనగాని, గొట్టిపాటి, డోలా, జనార్దన్రెడ్డి, ఆనం, నారాయణ, పయ్యావుల, భరత్, సవిత, మండిపల్లి మొదలైన వారు శుభాకాంక్షలను తెలిపారు. అదే విధంగా చంద్రబాబుకు దక్కిన అవార్డు యావత్ తెలుగుజాతికి గర్వకారణమని మంత్రులు అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi