కర్నూలులో మళ్లీ పెట్రోల్ కష్టాలు!పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు!
కర్నూలు, 27 ఏప్రిల్ (హి.స.)కర్నూలు జిల్లాలో ఇంధన కొరత లేదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేసినప్పటికీ, సోమవారం నగరంలో పలు పెట్రోల్ బంకులు మూసివేయడంతో ప్రజలు పెట్రోల్, డీజిల్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. పాత బస్టాండ్లోని కేఎంసీ పెట్రోల్ బంక్, ఎస్పీ క
Kurnool Emmiganur Fuel Shortage, Petrol Diesel become


కర్నూలు, 27 ఏప్రిల్ (హి.స.)కర్నూలు జిల్లాలో ఇంధన కొరత లేదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేసినప్పటికీ, సోమవారం నగరంలో పలు పెట్రోల్ బంకులు మూసివేయడంతో ప్రజలు పెట్రోల్, డీజిల్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. పాత బస్టాండ్లోని కేఎంసీ పెట్రోల్ బంక్, ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఉన్న రక్షక్ ఫ్యూయల్ స్టేషన్లో 'నో స్టాక్' బోర్డులు పెట్టడం ప్రజలలో ఆందోళన రేకెత్తించింది.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇంధన సెగలు రేగుతున్నాయి. పెట్రోల్ కోసం వాహనదారులు చుక్కలు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా సాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత నేడు పతాక స్థాయికి చేరడంతో పట్టణ వ్యాప్తంగా వాహనదారులు అల్లాడిపోతున్నారు. పట్టణంలో ఉన్న ఏడు పెట్రోల్ బంకుల్లో ఐదు ఇప్పటికే ‘నో స్టాక్’ బోర్డులు తగిలించి చేతులెత్తేయగా, కేవలం రెండు బంకులు మాత్రమే అరకొర నిల్వలతో కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా మంత్రాలయం రహదారిలోని ఎంజీ పెట్రోల్ బంక్, కర్నూలు రహదారిలోని హెచ్పి పెట్రోల్ బంక్ ల వద్ద నిన్న సాయంత్రం నుండి వాహనాలు పెట్రోల్ కోసం బారులు తీరాయి . క్యూ లైన్లలో నిలబడినా, తీరా బంక్ దగ్గరికి వెళ్లేసరికి కేవలం వంద రూపాయలకే పెట్రోల్ను పరిమితం చేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఆసియాలో మండుతున్న యుద్ధ జ్వాలలు ఇక్కడి సామాన్యుడి రవాణాను దెబ్బతీశాయి. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు, పై నుంచి సరైన స్టాక్ రాకపోవడంతో ఉన్న నిల్వలను రేషనింగ్ పద్ధతిలో పంపిణీ చేస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి.

రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆందోళనతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ అంతకు అంత పెరుగుతోంది. అత్యవసర పనుల మీద వెళ్లేవారు, ఆఫీసులకు చేరుకోవాల్సిన ఉద్యోగులు గమ్యం చేరలేక రోడ్ల మీదనే పడిగాపులు కాస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande