
తిరుమల/తిరుపతి, 27 ఏప్రిల్ (హి.స.)తిరుపతి జిల్లాలో డీజల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తిందని బంకుల యజమానులు చెబుతున్నారు. వాహనాలకు ఫుల్ ట్యాంకులు, మోతాదుకు మించి కాకుండా రోజువారీ అవసరాల కోసం ఇంధనం పట్టాలని అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. మరోవైపు తిరుమలలో పెట్రోల్ బంకులు ఆదివారం మూతపడడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. పెట్రోల్, డీజల్ స్టాక్ లేదనడంతో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సాయంత్రమైనా బంకులు తెరుచుకోకపోవడంతో సొంత వాహనాల్లో వచ్చిన చాలా మంది భక్తులు తిరుమలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. రాత్రికి ఒక బంకును తెరిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ