
హైదరాబాద్, 27 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాజనగణన -2027 (Census 2027) ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం తన వివరాలను సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఖమ్మంలోని ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' ('Self-enumeration') పద్ధతి ద్వారా అధికారిక వెబ్సైట్లో తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. డిజిటల్ విధానంలో ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునే ఈ సౌకర్యం వల్ల గణన ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జనగణన అనేది కేవలం అంకెలే కాదని, రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ఇది దిక్సూచి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఖచ్చితమైన గణాంకాలు ఉన్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందుతాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉండే ఈ స్వీయ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా భాగస్వాములు కావాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని జనగణన ప్రక్రియను పర్యవేక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..