
విశాఖపట్నం:27 ఏప్రిల్ (హి.స.) విశాఖ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. నగరానికి విచ్చేసిన మంత్రికి టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. టీడీపీ నేత చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ (వైజాగ్)’ అంటూ ప్లకార్డులు పట్టుకుని ఘనంగా స్వాగతించారు.
ఎయిర్పోర్టు వద్ద మంత్రి లోకేశ్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు, గూగుల్ ప్రతినిధుల తేనీటి విందులో పాల్గొనేందుకు నగరానికి లోకేశ్ వచ్చారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరుకానున్న పలువురు ప్రముఖులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్వాగతం పలకనున్నారు. మరోవైపు ఈ రోజు రాత్రి నోవాటెల్ హోటల్లో గూగుల్ ప్రతినిధుల గౌరవార్థం తేనీటి విందులో మంత్రి లోకేశ్ పాల్గొంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ