
తిరుపతి, 27 ఏప్రిల్ (హి.స.)
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పరిసరాల్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని జీవకోన సమీపంలో అడవి ఒక్కసారిగా అంటుకోవడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. జీవకోన సమీపంలోని మొండోడికోన నుంచి తిమ్మినాయుడుకోన వరకు మంటలు వేగంగా వ్యాపించాయి. విలువైన వనమూలికలు, భారీగా వృక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల ధాటికి వన్యప్రాణులు భయంతో పరుగులు తీశాయి.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ సిబ్బంది, అగ్నిమాపక దళం, స్థానికులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం కావడంతో ఫైర్ ఇంజన్లు వెళ్లడానికి సరైన దారి లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి వేగంగా వీస్తుండటంతో మంటలు పక్కనే ఉన్న గుట్టలకు వ్యాపిస్తున్నాయని, వీటిని పూర్తిగా ఆర్పడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
అయితే, అటవీ సంపదకు మాత్రం భారీ నష్టం వాటిల్లింది. ఎండల తీవ్రత పెరగడం వల్ల ఎండుటాకులు రాపిడికి గురై మంటలు చెలరేగి ఉండవచ్చని లేదా ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టారా అనే కోణంలో అటవీ శాఖ విచారణ చేపడుతోంది. ఎర్రచందనం నిల్వలు ఉన్న ప్రాంతం కావడంతో నిఘా పెంచామని, గిడ్డంగులకు ముప్పు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV