
కర్నూల్, 27 ఏప్రిల్ (హి.స.)అసలే వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. పల్లెల్లోని జనాలు ఎండ వేడిమి తట్టుకోలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. సెలవు రోజుల్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరగడంతో బెట్టింగ్ దందా జోరుగా జరుగుతోంది.
ముఖ్యంగా కర్నూల్ కేంద్రంగా నయా యాప్ల ద్వారా సాగుతున్న ఈ జూదం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. అందినకాడికి అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని పందాలు కాస్తున్న యువత, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
పల్లెటూళ్లు మొదలుకొని పట్టణాల వరకు ఎక్కడ విన్నా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడా నలుగురు గుమిగుడినా బెట్టింగ్ లో ఇంత గెలిచామని, ఇంత నష్టపోయామనే చర్చ జరుగుతుంది. ఏ మ్యాచ్ గెలుస్తుంది? సిక్స్, అవుట్ విషయాలపై బెట్టింగ్పెడుతూ కొంతమంది లాభాలు గడ్డిస్తుండగా మరి కొంతమంది తీవ్రంగా నష్టపోతున్నారు. బెట్టింగ్దందా రోజు రోజుకూ పెరిగిపోతుంది. బెట్టింగ్ కోసం కొందరు ఇంట్లో ఉన్న సొమ్ముంతా పోగొట్టుకుంటూ నష్టపోతున్నారు.
కొంతమంది బంతి బంతికి బెట్టింగ్ కడుతుండగా మరి కొంతమంది మాత్రం మ్యాచ్ మ్యాచ్ కు మాత్రమే బెట్టింగ్ కడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బెట్టింగ్ లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ బెట్టింగ్ ఎక్కువ జరుగుతుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం రోడ్ల పై, వీధుల్లోకి వచ్చి గెలిచినవారు ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ ఆట మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బెట్టింగ్లు జరుగుతూనే ఉన్నాయి. బెట్టింగ్ పై పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు మాత్రమే బెట్టింగ్ జరుగుతుండగా భూపాలపల్లి జిల్లాలో మాత్రం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్పెడుతున్నారు. 15 రోజులుగా ఈ బెట్టింగ్ సరదాలోనే చాలామంది మునిగిపోతున్నారు. పోలీసు వర్గాలు బెట్టింగ్పై నిఘా పెట్టి వాటిని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV