
ఖమ్మం, 27 ఏప్రిల్ (హి.స.)
ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే చేరాలనే సంకల్పంతో, పాలేరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సరికొత్త బాటలు వేస్తున్నారు. సామాన్యులు తమ చిన్నపాటి అవసరాల కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగకూడదన్న ధ్యేయంతో చేపట్టిన 'ప్రజా దర్బార్' కార్యక్రమం రేపు (మంగళవారం) రెండు ప్రధాన కేంద్రాల్లో జరగనుంది. కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన ప్రజల కోసం అధికారులు క్షేత్రస్థాయికి రానున్నారు.
మంగళవారం ఉదయం 8:00 గంటలకు కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ఆవరణలో ప్రజా దర్బార్ ప్రారంభం కానుంది. ఈ కేంద్రానికి పాలేరు, నాయకన్ గూడెం, భగవత్వీడు తండా, మంగళ్ తండా, కొత్తూరు, నర్సింహులగూడెం, సంధ్యా తండా, లాల్ సింగ్ తండా, గైగోల్లపల్లి, బోడియా తండా, చౌటపల్లి, ఎర్రగడ్డ తండా, గురవాయిగూడెం సహా 13 గ్రామ పంచాయతీల ప్రజలు హాజరుకావచ్చు.
మధ్యాహ్నం 3:30 గంటల నుండి ఖమ్మం రూరల్ మండలం అరెంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మరో దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రానికి అరెంపుల, చింతపల్లి, కొండాపురం, అరేకోడు, అరేకోడు తండా, పొన్నేకల్, తల్లంపాడు, ৯০. వెంకటాయపాలెం, కన్నతండా, కాచిరాజుగూడెం, తనగంపాడు, గూడూరుపాడు మొత్తం 12 గ్రామాల ప్రజలు తరలిరానున్నారు.
వేదికపైనే పరిష్కారం..
జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్ సహా అన్ని శాఖల అధికారులు ఈ వేదికలపై అందుబాటులో ఉంటారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను తక్షణమే పరిశీలించి, పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..