
తిరుమల, 27 ఏప్రిల్ (హి.స.)
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించడంతో తిరుమల తిరుపతిలో రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో తిరుమల కొండపై రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతోంది.
ఉచిత దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే స్వామివారిని 79,878 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,037 మంది మొక్కల మేరకు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, అన్నప్రసాదం, మజ్జిగ పంపిణీని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV