అనంతపురం జిల్లాలో హిజ్రా అనుమానస్పద మృతి..
అనంతపురం జిల్లాలో హిజ్రా అనుమానస్పద మృతి..
అనంతపురం జిల్లాలో హిజ్రా అనుమానస్పద మృతి..


అనంతపురం, 27 ఏప్రిల్ (హి.స.)అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లిక అనే హిజ్రా రైల్వే గేట్ పట్టాలపై శవమై కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది ముమ్మాటికీ హత్యేనని తోటి హిజ్రాలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణానికి చెందిన మల్లిక అనే హిజ్రా నిన్న(ఆదివారం) సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన కొంతమంది హిజ్రాలు ఆమెను ఆటోలో బలవంతంగా తీసుకువెళ్లినట్లు సమాచారం. మల్లికను ఆటోలో తీసుకువెళ్తున్న దృశ్యాలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఆధారాలు ఇప్పుడు కేసు విచారణలో అత్యంత కీలకంగా మారాయి. ఈ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఆదివారం రాత్రి చల్లవారిపల్లి రైల్వేగేట్ సమీపంలో రైల్వే పట్టాలపై ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అది మల్లిక మృతదేహంగా గుర్తించారు. మల్లిక మృతి వార్త తెలియడంతో తోటి హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లికను పక్కా పథకం ప్రకారం కిడ్నాప్ చేసి, ప్రత్యర్థి గ్రూపుకు చెందిన వారే దారుణంగా హత్య చేసి రైల్వే పట్టాలపై పడేశారని వారు ఆరోపిస్తున్నారు.

పోలీసుల చర్యలు.. ముగ్గురు హిజ్రాల అరెస్ట్

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తాడిపత్రి పట్టణ పోలీసులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. మల్లిక మృతికి సంబంధించి అనుమానితులుగా ఉన్న ముగ్గురు హిజ్రాలను నిన్న అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. శిరీష, సంగీత, రాధలను పోలీసులు అదపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం వీరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హిజ్రా వర్గాల మధ్య ఉన్న గ్రూపు తగాదాలే ఈ హత్యకు దారితీశాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాడిపత్రిలో హిజ్రాల మధ్య తలెత్తిన ఈ ఘర్షణ మరణానికి దారితీయడం చర్చనీయాంశంగా మారింది. మల్లిక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఇది హత్య లేక ఆత్మహత్య అనే విషయంపై మరింత స్పష్టత రానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande