
మచిలీపట్నం, 28 ఏప్రిల్ (హి.స.)
మచిలీపట్నం పోర్టు విషయంలో వైసీపీ నేతల వైఖరిపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. దండుపాళ్యం బ్యాచ్ బందరుకి వచ్చి ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడిందని మండిపడ్డారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి మంత్రి రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్టును గోగిలేరుకు తరిమేసేందుకు లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని అని ఆరోపించారు. గతంలో బందరు పోర్టు కోసం తామంతా ఉద్యమాలు చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేశారని మండిపడ్డారు.
పోర్టు సాధించకుంటే ముక్కు నేలకు రాస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్ని నాని ప్రగల్భాలు పలికారని, అధికారంలో ఉన్నన్ని రోజులు పోర్టు గురించి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు కొల్లు రవీంద్ర. 2014లో రైతులకు పరిహారం అందించి, ప్రజలను ఒప్పించి బందరు పోర్టుకు తాము శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రెడ్డి, పేర్ని నాని 2023 వరకు పోర్టును కనీసం పట్టించుకోలేదన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాటి ఎంపీ బాలశౌరి రూ.4వేల కోట్లు తీసుకొచ్చారని.. అప్పటికే శంకుస్థాపన చేసిన పోర్టుకు మళ్లీ శంకుస్థాపన చేసి వైసీపీ ప్రభుత్వంలో డ్రామాలాడారని ఆగ్రహించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టు పనుల్ని వేగవంతం చేసి 40 శాతం పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేసి చూపిస్తామని మంత్రి కొల్లు ధీమా వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ల పనుల్లో జగన్ రెడ్డి అండ్ కో కమీషన్లు దండుకోవడం తప్ప పనులపై ఏ రోజూ దృష్టి పెట్టలేదన్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీ విషయంలోనూ వైసీపీ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పోర్టులు పూర్తి చేసేది, ప్రారంభోత్సవాలు చేసేది తామేనంటూ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. .
ఈవీఎంలు పగలగొట్టి, హత్యలు చేసి జైలుకు వెళ్లొచ్చిన వారు, పేదల బియ్యాన్ని బొక్కేసి బెయిల్పై తిరుగుతున్న వారు నేడు బందరుకు వచ్చి నీతులు చెబుతున్నారని మంత్రి ఆగ్రహించారు. కమీషన్ల కోసం కియా సంస్థను బెదిరించిన నీచ చరిత్ర వైసీపీదని, లులు సంస్థను ఎలా తరిమేశారో ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని మంత్రి కొల్లు ప్రశ్నించారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకుని రాజకీయం చేయడమే జగన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు తేవడం, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి. తద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల మధ్య రాజకీయ విద్వేషాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ