
అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.): డ్రైవరు వీధి సుబ్రహ్మ ణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ద్వారా బుధవారం ఈ పిటిషన్ వేయనున్నారు. సాక్షులను ప్రలోభాలకు గురి చేయడం, డబ్బులిచ్చి తమకు అనుకూలంగా వ్యహరించాలని లేదా చంపేస్తామని బెదిరించడం వంటి తీవ్రమైన నేరారోపణలతో కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబుకు కోర్టు రిమాండు విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దర్యాప్తు కొనసాగింపులో భాగంగా అనంతబాబును కస్టడీకి కోరుతూ పోలీసులు మంగళవారం కాకినాడ కోర్టును ఆశ్రయించారు. అయితే హత్య కేసు విచారణ జరుగుతున్న కోర్టులోనే పిటిషన్ వేయాలని న్యాయాధికారి సూచించారు. దీంతో బుధవారం రాజమండ్రిలోని జిల్లా కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు హత్య కేసులో బెయిల్పై ఉన్న అనంతబాబు కోర్టు షరతులను ఉల్లంఘించిన కారణంగా బెయిల్ రద్దు చేయాలని ఇప్పటికే స్పెషల్ పీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం వాదనలు జరగనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ