
కరీంనగర్, 28 ఏప్రిల్ (హి.స.) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్
మండలంలోని సిరిసపల్లి శివారులో ప్రతిపాదిత 'వేస్ట్ టు ఎనర్జీ' (చెత్త నుండి విద్యుత్) ప్లాంట్, డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి.గత 37 రోజులుగా శాంతియుతంగా సాగుతున్న దీక్షలు, మంగళవారం నాటికి ఉధృత రూపం దాల్చాయి. ప్లాంట్ ఏర్పాటును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
సింగాపూర్, సిర్సపల్లి రాంపూర్, పోతిరెడ్డిపేట, కందుగులతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రహదారుల పై దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత 37 రోజులుగా రిలే నిరసన దీక్షలు, ధర్నాలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంపై నిరసనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ప్లాంట్ ఏర్పాటు ముఖ్యం కాకూడదు. 37 రోజులుగా ప్రజలు రోడ్లపై ఉండి పోరాడుతున్నా, కనీసం పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. అని బీజేపీ పార్టీ నాయకులు పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని, రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చోటుచేసుకునే పరిణామాలకు, ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..