
హనుమకొండ, 28 ఏప్రిల్ (హి.స.)
హనుమకొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ఇంధన కొరత లేదని, వివిధ పెట్రోలియం సంస్థల ద్వారా డీజిల్, పెట్రోల్ నిల్వలు అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు ఆందోళన చెందవద్దని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎనర్జీ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ పెట్రోలియం సంస్థలు పెట్రోల్, డీజిల్ నిల్వలు గురించిన వివరాలను ఆయా సంస్థల ప్రతినిధులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ.. జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేనప్పటికీ పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ కొరకు క్యూలైన్లో ఉంటున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత అంటూ అసత్య ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదని అన్నారు. పెట్రోల్ బంకుల్లో క్యూ లో ఉన్న వాహనదారులకు పెట్రోల్, డీజిల్ పోయాలని అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో బాటిళ్లు, క్యాన్లలో పోయడం ద్వారా వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..