తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: స్టీఫెన్ రవీంద్ర
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. .
Ravindra


హైదరాబాద్, 28 ఏప్రిల్ (హి.స.)తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 70 రోజులకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. మంగళవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. భయంతో ప్రజలు అవసరం కంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేయడం వల్లే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద తాత్కాలికంగా స్టాక్ అయిపోయినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులు పెట్టినప్పటికీ, రోజువారీ అమ్మకాల కంటే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నట్లు మానిటరింగ్లో తెలుస్తోందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.

బెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయన్న భయంతో ప్రజలు అధిక మొత్తంలో ఇంధనం కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గత వారం ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో నష్టాలను తగ్గించుకోవడానికి వ్యాపారులు, వినియోగదారులు డీజిల్ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు గమనించామని ఆయన తెలిపారు. ఈ సమస్య ఈరోజు రాత్రి వరకు పూర్తిగా పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. ఏపీ సరిహద్దు జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande