
హనుమకొండ, 28 ఏప్రిల్ (హి.స.)
కల్లాల్లో ఉండాల్సిన ధాన్యం రోడ్లపైఆరబోయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ వాహనాలు అదుపుతప్పి ఘోర రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణనష్టం జరుగుతున్న సంఘటనలు జిల్లా ఉన్నాయి. హనుమకొండ కమలాపూర్ మండలంలో అన్ని గ్రామాలకు వెళ్లే తారు రోడ్లతో పాటు ప్రధాన రహదారి హుజూరాబాద్ పరకాలపై కూడా రైతులు రోడ్డును సగానికి పైగా ఆక్రమించి ధాన్యం ఆరబోశారు. దీంతో రహదారిపై వేగంగా వెళుతున్న చిన్న, పెద్ద వాహనాలతో పాటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వాహనాలను ఓవర్టేక్ చేసే సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటూ ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
గతంలో ఇదే ప్రధాన రహదారిపై భారీ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రాత్రి ప్రయాణిస్తున్న వాహనదారులకు రోడ్డుపై నిల్వ చేసిన ధాన్యం రాశులు సరిగా కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. కల్లాల్లో ఉండాల్సిన ధాన్యం ఇలా రోడ్లపై ఆరబోయడంతో ప్రయాణికులకు ఎంతో ప్రమాదకరమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు పోలీస్ అధికారులు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు. కానీ వాహనదారులు ప్రయాణానికి కావాల్సిన సేఫ్టీ ఉపయోగించకపోతే జరిమానాలు విధిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..