
రంగారెడ్డి, 28 ఏప్రిల్ (హి.స.)
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని ఓ సిమెంట్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులకు భారీ క్రేన్లు కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. తొలుత ముగ్గురు కార్మికులు మరణించినట్లు సమాచారం అందగా.. సహాయక చర్యల తర్వాత మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఎన్సీసీ (NCC) వర్క్షాప్లో రెండు భారీ క్రేన్లు కుప్పకూలి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో 12 మంది గాయపడగా.. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మహాలింగాపురం గ్రామంలోని కన్స్ట్రక్షన్ వర్క్ షాప్ లో సోమవారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో, 17 మంది కార్మికులు రక్షణ కోసం ఒక తాత్కాలిక షెడ్డు కింద తలదాచుకున్నారు. అయితే.. గాలుల ధాటికి అక్కడే ఉన్న ఒక క్రేన్ పక్కకు జరిగి మరో క్రేన్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ రెండు భారీ క్రేన్లు నేరుగా కార్మికులు ఉన్న షెడ్డుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన నలుగురు, ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్లకు ఉండాల్సిన సేఫ్టీ లాక్లు సరిగ్గా లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు