
తెలంగాణ, 28 ఏప్రిల్ (హి.స.)
రోహిణి కార్తె రాకముందే.. రోళ్లు పగిలే టెండలతో రాష్ట్రం భగభగ మండుతోంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడి ప్రతాపానికి ప్రజలు నీరసించిపోతున్నారు. తొలిసారిగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కరోజే వడదెబ్బ, పిడుగుపాటుకు రాష్ట్రంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో నిన్న అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీలు, ఇతర జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.
మండుటెండల నేపథ్యంలో మూడు జిల్లాల్లో ముగ్గురు మరణించారు. మంచిర్యాల జిల్లాలో భోగారపు మారయ్య (56), పెద్దపల్లి జిల్లాలో దశరథం సౌమ్య (19), నారాయణ పేట జిల్లాలో ఓ వృద్ధుడు వడదెబ్బకు గురై చనిపోయారు. పగలంతా ఉక్కపోత, మండుటెండలతో ఉగ్రరూపం చూపించిన సూరీడు సాయంత్రానికి చల్లబడగా.. సంగారెడ్డి జిల్లాలో కుర్మ రంగు జంగయ్య (51) అనే రైతు పొలంలో పనిచేస్తుండగా పిడుగుపడి మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా.. రానున్న మూడ్రోజులపాటు రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరో 1-2 డిగ్రీలు పెరిగే ఛాన్సుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు