
చిత్తూరు, 28 ఏప్రిల్ (హి.స.)
వి.కోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈరోజు(మంగళవారం) ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి జగన్ను కత్తులతో నరికి చంపేశారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు పాల్పడింది రౌడీ షీటర్ తమీమ్గా గుర్తించారు. తమీమ్కు మరో వ్యక్తి సాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. తమీమ్ది వి.కోట అయినప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో నివాసం ఉంటున్నాడు. మృతుడు జగన్మోహన్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
హత్యను ఖండించిన జర్నలిస్టు సంఘాలు
జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిచాయి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటన సిగ్గుచేటు కలిగించే చర్యగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తిరుపతి జిల్లా సభ్యులు అరవ గోపాల్ అన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకోవాల్సిన మార్గాలు చాలా ఉన్నాయని... అలా కాదని దుర్మార్గమైన, దుహంకారమైన ఆలోచనలతో తోటి మనిషిని చంపడం బాధాకరమన్నారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తోటి విలేకరి చనిపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 'ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ పోరం' తరఫున అరవ గోపాల్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చెంగల్రాయులు (గాంధీ), వళిగళం గోపిలు తీవ్రగా ఖండించారు. హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్య వెనుక ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని హత్య వెనుకున్న అసలు నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలన్నారు. . ఒక సామాన్య జర్నలిస్టును అతి కిరాతంగా చంపడం దారుణమని అన్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు వెంటనే హత్య వెనుక దాగి ఉన్న కుట్రను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్ట్ సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెంగల్రాయులు, వళిగళం గోపి ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV