
అనంతపురం, 28 ఏప్రిల్ (హి.స.)అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన వలపువల కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్, వైసీపీ నేత నరేంద్రరెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా వైసీపీ నేత నరేంద్రరెడ్డి, పొత్తూరి ఓం ప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఇద్దరి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్లలో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల విచారణలో నరేంద్రరెడ్డికి వలపువల ముఠా సూత్రధారులైన రంగమ్మ అలియాస్ చిన్ని, ఉమాదేవి, మళ్లీశ్వరి గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ గ్యాంగ్లు వలపువల పేరుతో పలువురు బాధితులను మోసం చేసి, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి
వలపువలలో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పంచాయతీలు నిర్వహించడం ద్వారా నరేంద్రరెడ్డి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులను భయపెట్టి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి భారీ మొత్తాలు తీసుకున్నట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు..
ఈ కేసులో మరి కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ప్రస్తుతం పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ కార్యకలాపాల విస్తృతి, బాధితుల వివరాలు, ఆర్థిక లావాదేవీలు, రాజకీయ సంబంధాల వంటివి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల ఆధారంగా వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV