100 రోజుల ‘జలధార’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు -జిల్లా కలెక్టర్
100 రోజుల ‘జలధార’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు -జిల్లా కలెక్టర్
At a workshop related to the ‘Jaladhara’ program


నంద్యాల, 28 ఏప్రిల్ (హి.స.),నంద్యాల జిల్లాలో 100 రోజుల ‘జలధార’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు సమిష్టిగా అంకితభావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు.

ఈరోజు ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ‘జలధార’ కార్యక్రమానికి సంబంధించిన వర్క్షాప్లో కలెక్టర్ పాల్గొని ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు సంబంధిత శాఖల అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల నివారణ లక్ష్యాలుగా తీసుకుని100 రోజుల ‘జలధార’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి అధికారి తమ పరిధిలో ప్రణాళికాబద్ధంగా పని చేసి స్పష్టమైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు. జిల్లాలోని 30 మండలాల్లో 11 మండలాలు నీటి నిల్వ విషయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వర్షాల అనంతరం భూగర్భ జలాల మట్టం 3 మీటర్ల లోపల, వర్షాలకు ముందు 8 మీటర్ల లోపల ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఆ మేరకు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు.

కృష్ణా నది జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, తెలుగు గంగ, కెనాల్, కేసీ కెనాల్లుగా విభజించి సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. అయితే డోన్ మండలంలోని కొచ్చెరువు ప్రాంతంలో భూగర్భ జలాలు సుమారు 45 మీటర్ల లోతులో ఉన్నాయని, జిల్లాలోని 165 గ్రామాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులోకి పడిపోయిందని చెప్పారు. డోన్, ప్యాపిలి మండలాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉందని తెలిపారు.

జిల్లాలో ఉన్న 330 మైనర్ ఇరిగేషన్ చెరువుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని చెప్పారు. నీటి వనరులు నిండే విధానాలపై అవగాహన కల్పిస్తూ, వర్షపాతం, మేజర్ కెనాల్స్ ద్వారా నీటి మళ్లింపు, సహజ ప్రవాహాల ద్వారా నీటి చేరిక వంటి అంశాలలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని చెరువులు నిండడం కొన్ని కెనాల్స్ ద్వారా, మరికొన్ని సహజ ప్రవాహాల ద్వారా, మిగిలినవి పూర్తిగా వర్షాలపై ఆధారపడుతున్నాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande