
గ్యాంగ్టక్, 28 ఏప్రిల్ (హి.స.)
మతం, రాజకీయాల పేరుతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో హిమాలయ రాష్ట్రమైన సిక్కిం జాతి ఐక్యతను సగర్వంగా చాటిచెబుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తిని సిక్కిం అద్భుతంగా ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. సిక్కిం రాష్ట్రం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో రాజధాని గ్యాంగ్టక్లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సుమారు రూ.4వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, సిక్కిం అభివృద్ధి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని ఆరోపించారు.
'బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఇంతకు ముందే కూడా చేసి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు సిక్కిం అభివృద్ధిని ఎప్పుడూ వెనక్కి నెట్టేశాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సిక్కింలో అభివృద్ధి మళ్లీ ఊపందుకుంది. మొట్టమొదటిసారిగా, రైల్వే సిక్కింకు చేరుకోబోతోంది. ఈశాన్య ప్రాంతం కేవలం దేశంలో ఒక ముఖ్యమైన భాగం మాత్రమే కాదని, ఇది భారత్ అష్టలక్ష్మి' అని పేర్కొన్నారు. 'యాక్ట్ ఈస్ట్' విధానంపై పనిచేయడంతో పాటు, 'యాక్ట్ ఫాస్ట్' చేయాలని కూడా సంకల్పించామని తెలిపారు.
సిక్కింలో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను తీసుకువచ్చిందని ప్రధాని తెలిపారు. సిక్కిం ఆర్థిక వృద్ధికి పర్యాటక రంగమే కీలకమని పేర్కొన్నారు. సిక్కింలో కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందనట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సిక్కింకు దేశంలోని ఇతర ప్రాంతాలతో మరింత సులభమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.
సిక్కిం రాష్ట్రం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజధాని గ్యాంగ్టక్లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ముఖ్యంగా భారత పటం ఆకారంలో పలువురు కళాకారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. సిక్కింలో 4 వేల కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ విద్య, విద్యుత్, పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటకం, వ్యవసాయం వంటి విస్తృత రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi