
ఢిల్లీ, 28 ఏప్రిల్ (హి.స.)
అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్పై భారత దర్యాప్తులో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసు (Drugs case) లో ఇటీవల టర్కీలో అరెస్టైన దావూద్ ఇబ్రహీమ్ (Dawood Ibrahim) అనుచరుడు సలీమ్ డోలా (Salim Dola) ను భారత్కు తీసుకొచ్చారు. భారత్లో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న సలీమ్ డోలా రెండు రోజుల క్రితం టర్కీ (Turkey) లోని ఇస్తాంబుల్ (Istambul) లో అరెస్టయ్యాడు. అతడిని తాజాగా భారత్కు అప్పగించడంతో అధికారులు ఈ తెల్లవారుజామున ఢిల్లీ (Delhi) కి తీసుకొచ్చారు.
డోలాను తరలించిన ప్రత్యేక విమానం మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ టెక్నికల్ ఎయిర్పోర్టులో దిగిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడిని విచారణ నిమిత్తం సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణ పూర్తయిన అనంతరం.. డోలాను ముంబై పోలీసులకు లేదా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ డోలా అరెస్ట్.. అండర్వరల్డ్ డ్రగ్ మాఫియాకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. దావూద్ ఇబ్రహీంకు చెందిన డి-కంపెనీ విదేశాల్లో నిర్వహించే డ్రగ్ ఆపరేషన్లకు డోలానే ప్రధాన సూత్రధారి.
డోలా కనుసన్నల్లో ఏడాదికి రూ.5 వేల కోట్ల డ్రగ్స్ వ్యాపారం సాగుతోందనే అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం డోలా నెట్వర్క్కు చెందిన సలీమ్ సోహైల్ షేక్ అనే డీలర్ దుబాయ్లో అరెస్టయ్యాడు. అతడిని భారత్కు అప్పగించిన తర్వాత ఈ డ్రగ్ నెట్వర్క్ తీగ లాగితే గత ఏడాది జూన్లో సలీమ్ డోలా కుమారుడు తాహెర్ పట్టుబడ్డాడు. తాహెర్ను కూడా యూఏఈ నుంచి భారత్కు తీసుకొచ్చి విచారించారు. ఈ క్రమంలోనే సలీమ్ డోలా ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi