
న్యూఢిల్లీ, 28 ఏప్రిల్ (హి.స.)
ప్రపంచ దేశాల్లో రక్షణ రంగం (Defence Sector) పై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ (India) ఐదో స్థానంలో నిలిచింది. గడిచిన ఏడాది (2025) లో మన దేశం రక్షణ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అమెరికా (USA), చైనా (China), రష్యా (Russia), జర్మనీ (Germany) దేశాలు ఈ జాబితాలో భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు స్టాక్హోమ్ (STOCKHOME) అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం తాజాగా ఓ నివేదిక (Report) ను విడుదల చేసింది.
2025లో ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం 2.9% పెరిగి 2,887 బిలియన్ డాలర్లుగా ఉందని ఆ నివేదిక తెలిపింది. ఇక 2025లో భారత్ తన రక్షణ వ్యయాన్ని 92.1 బిలియన్ డాలర్లకు పెంచింది. ఇది 2024 కంటే 8.9% అధికమని పేర్కొన్నది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చుచేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఇక రక్షణ రంగం కోసం 954 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 336 బిలియన్ డాలర్ల వ్యయంతో చైనా రెండో స్థానంలో ఉన్నది.
ఇక ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో 190 బిలియన్ డాలర్ల ఖర్చుతో రష్యా మూడో స్థానంలో, 114 బిలియన్ డాలర్ల ఖర్చుతో జర్మనీ నాలుగో స్థానంలో ఉన్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరగడంలో యూరప్ది కీలకపాత్ర అని నివేదిక పేర్కొన్నది. యూరప్ తన వ్యయాన్ని 14 శాతం పెంచి 864 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది. కాగా పాకిస్థాన్ కూడా తన రక్షణ వ్యయాన్ని 11 శాతం పెంచింది. 11.9 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో 31వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi