ఆకివీడు రామాలయం పిల్ పరిష్కారం: డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు
ఆకివీడు రామాలయం పిల్ పరిష్కారం: డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు
ఆకివీడు


ఆకివీడు, 29 ఏప్రిల్ (హి.స.)

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సంబంధించి దాఖలైన పిల్ (PIL) ను ఏపీ హైకోర్టు నేడు పరిష్కరించింది. ఇప్పటికే ఈ అంశంపై రిట్ పిటిషన్ మరియు కోర్టు ధిక్కరణ కేసులు మరొక బెంచ్ వద్ద విచారణలో ఉన్నాయని ధర్మాసనం గుర్తించింది. ఒకే అంశంపై వేర్వేరు బెంచ్ల వద్ద విచారణ అవసరం లేదని భావిస్తూ, పెండింగ్లో ఉన్న ఆ కేసుల్లోనే తమ వాదనలు వినిపించుకోవాలని పిటిషనర్లకు సూచించింది. తొలుత ఈ పిల్ ను కొట్టివేస్తామని కోర్టు పేర్కొన్నప్పటికీ, పిటిషనర్ తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేసును 'డిస్పోజ్' చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేపట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ ఈ వ్యవహారాన్ని ముగించింది.

ఇదిలా ఉండగా ఆకివీడు పెదపేట రామాలయ నిర్మాణానికి సంబంధించి మే 3వ తేదీ ఆదివారం ఉదయం 7:14 గంటలకు భూమి పూజ (శంకుస్థాపన) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జెసిబిలతో నేల చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. 1932 నాటి రికార్డుల ప్రకారం అక్కడ రామాలయం ఉన్నట్లు అధికారులు ధృవీకరించడంతో, మున్సిపల్ కౌన్సిల్ కూడా నిర్మాణానికి అనుకూలంగా తీర్మానం చేసింది.

ఈ ఆలయాన్ని సుమారు రూ. 1.25 కోట్ల అంచనా వ్యయంతో, కృష్ణ శిలతో (నల్ల రాయి) ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించనున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే భక్తుల నుండి కోటి రూపాయలకు పైగా విరాళాలు అందాయి. ఎటువంటి ఆటంకాలు కలగకుండా అధికారులు మరియు పోలీసులు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande