
నెల్లూరు,, 29 ఏప్రిల్ (హి.స.)నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కరివేడు గ్రామ పరిధిలో ఉన్న సీలింగ్ భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా రంగంలోకి దిగారు. అటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతోపాటు జిల్లా రెవెన్యూ అధికారులతోనూ ఆయన చర్చించారు. నేరుగా గూడూరుకు వెళ్లిన కలెక్టర్.. కడివేడు సీలింగ్ భూములపై ఆరా తీశారు. సర్వే నంబర్లు 805, 876, 367, 743 నుంచి 800లలో సుమారు 2400 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిని గతంలోనే ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగించారు.
అత్యంత విలువైన భూములు కావడంతో ఎలాగైనా వీటిని కొట్టేయాలని చాలా కాలం నుంచి కొందరు అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గూడూరు ఆర్డీవో, చిల్లకూరు తహసీల్దార్ ఈ కుట్రలను 2010 నుంచి అడ్డుకుంటూ వచ్చారు. అయితే చిల్లకూరు మండలం నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలోకి మారడంతో అక్రమార్కులకు కలిసొచ్చింది. గత ప్రభుత్వంలో వేగంగా పావులు కదిపారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఓ అధికారి, తిరుపతి జిల్లాకు చెందిన మరో అధికారి కడివేడులోని సీలింగ్ భూములను దొడ్డిదారిన అక్రమార్కులకు కట్టబెట్టినట్లు సమాచారం. ఈ భూములకు సంబంధించిన సమాచారాన్ని తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా ఫైళ్లు కనిపించడం లేదంటూ గూడూరు ఆర్డీవో కార్యాలయ అధికారులు సమాధానమిచ్చారు. దీనిని బట్టి చూస్తే సీలింగ్ భూముల రికార్డులు మాయం చేసినట్లు స్పష్టమవుతోంది. కనిపించకుండా పోయిన రికార్డులన్నింటినీ బయటకు తీయాలని కలెక్టర్ శుక్లా గూడూరు డివిజన్ రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ భూములపై ప్రభుత్వానికి త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను అందజేయనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ