మళ్లీ నిలిచిన మంజీరా జలాల తరలింపు
హైదరాబాద్ నగరానికి మంజీరా జలాలు మళ్లీ నిలిచిపోయాయి.
Manjeera water


హైదరాబాద్, 29 ఏప్రిల్ (హి.స.)నగరానికి మంజీరా జలాలు మళ్లీ నిలిచిపోయాయి. కృష్ణా, గోదావరి జలాల మాదిరిగా నిరాటంకంగా నగరానికి నీళ్లు సరఫరా కావడం లేదు. వాతావరణ మార్పులతో ఇటీవల గాలిదుమారం, వడగళ్ల వాన కురుస్తుండగా విద్యుత్ అంతరాయం తలెత్తుతోంది. ఎన్నో ఏళ్ల నాటి విద్యుత్ వ్యవస్థ కావడంతో చెట్ల కొమ్మలు తగిలినా నగరానికి మంజీరా నీటిని పంపింగ్ చేసే మోటర్లకు విద్యుత్ సరఫరా కావడం లేదు. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు మంజీరా పంపింగ్ స్టేషన్కు విద్యుత్ అంతరాయం తలెత్తడం వల్ల నీటి తరలింపు నిలిచిపోయింది.

దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. కానీ గాలులు వీస్తుండగా పంపింగ్ స్టేషన్లలోని మోటార్లపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో అర్ధరాత్రి వరకు నగరానికి నీటి సరఫరా నిలిపివేశారు. నాలుగు రోజుల్లో మూడుసార్లు మంజీరా జలాల తరలింపు నిలిచిపోయింది. పంపింగ్ ప్రారంభమై నగరానికి నీరు సరఫరా చేయడానికి ఆరేడు గంటల సమయం పడుతుండడంతో పలు ప్రాంతాలకు సమృద్ధిగా సరఫరా కాకపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రధానంగా రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, సనత్నగర్ పరిసర ప్రాంతాలకు లోప్రెషర్తో, కొన్నిసార్లు తాత్కాలిక అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కల్బుర్గ్, రాజంపేటలోని మంజీర పంపింగ్ స్టేషన్ ప్రాంతాలకు స్తంభాల లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయడంతో చెట్ల కొమ్మలు తగిలి ట్రిప్పవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్, వాటర్బోర్డు అధికారులు సమన్వయం చేసుకొని వారాంతంలో చెట్లకొమ్మలు తొలగించే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. స్తంభాల స్థానంలో టవర్స్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande